రాష్ట్రవ్యాప్తంగా రెడ్ క్రాస్ సేవలు బలోపేతం చేయాలి.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తన సమాజహిత కార్యక్రమాలను విస్తృత పరచి ప్రజలకు సేవలు మరింత చేరువ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ కు నూతన చైర్మన్ గా ఎన్నికైన వై. డి. రామారావు, కోశాధికారిగా ఎన్నికైన పి. రామచంద్రరాజులు, ప్రధాన కార్యదర్శి AK పరిడాతో కలిసి మర్యాదపూర్వకంగా రాజ్ భవన్ లో గవర్నర్ ను కలసిన సందర్భంగా గవర్నర్ నజీర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 20 రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రాలలో ప్రజలకు నాణ్యమైన రక్తసేవలు అందుతున్నాయని, రాబోయే రోజుల్లో అన్ని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్స్ ను ఆధునీకరించి ఇంకా మెరుగైన రక్తసేవలను ప్రజలకు అందజేయాలని ఆయన తెలిపారు. భారతదేశంలోనే తొలిసారి సింగల్ యూజ్ ప్లాస్టిక్ రహిత సమాజము ఏర్పాటే ధ్యేయంగా రెడ్ క్రాస్ గుంటూరు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న "వార్ ఆన్ సింగిల్ యుజ్ ప్లాస్టిక్ " పైలెట్ పాజెక్ట్ ను మార్చి నెలలో తాను గుంటూరు నగరంలో ప్రారంభిస్తానని గవర్నర్ తెలిపారు. విజయవాడ నగరములో రెడ్ క్రాస్ భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్బంగా చైర్మన్ గా ఎన్నికైన రామారావు, కోశాధికారి గా ఎన్నికైన రామచంద్రరాజులను గవర్నర్ అభినందిస్తూ వారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ చేపట్టబోయే అన్ని సేవాకార్యక్రమాలకు తన సహాయ, సహకారాలు అందజేస్తానని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు.
Share this article in your network!